Tuesday, January 27, 2015

ఎంతో చేద్దామని

ఎంతో చేద్దామని
మరెంతో సాధిద్దామని
ఇంకెంతో నేర్చుకున్నాను
సమకూర్చుకున్నాను

అంతా సాధించడానికి
ఇసుమంత కూడా చేయనవసరం లేదని తెలుసుకున్నాను
అంతా సాధిస్తూ
ఏమీ చేయని దేవుడనయ్యాను
బ్రహ్మనయ్యాను
రాతి బొమ్మనయ్యాను

శిష్య బృందం

శిష్య బృందం కాని ఒక తరగతి లో విద్యార్థులు కాని
వీరందరూ మొలకెత్తుతున్న నారు మళ్ళు
తదుపరి, ఒక్కొక్క నారు విడిగా ఎదగాలి
మహావృక్షం కావాలి
కల్ప వృక్షం అవ్వాలి 
రాగాలలో వేద శాస్త్రాలు ధ్వనించాలి
దేవ  గంధర్వుల గాన మాధుర్యం అందాలి 

మాట

మాట

మాట ఓ ఆటలా ఉండాలి
దాని నుండి పాట  వినిపించాలి
సెలయేటి నీటిలా సునాయాసంగా సాగి పోవాలి
ఆ నీటి తేట లో బరువు గుండెలు సేద తీర్చుకోవాలి
మనసు లోని  గాయాలు మాయమవ్వాలి
నీ గుండెలోని తీపి తేనియ ను వినువారి నాలిక్కి అందించాలి
తీపి  తింటున్నానా  లేక వింటున్నానా 
అనుకునేట్లు
అనుకోనట్లూ
చల్లగా మెత్తగా పలికించు
అందమైన పరిమళాలు కురిపించు 

పండుగలూ పబ్బాలూ

పండుగలూ పబ్బాలూ
నోములూ వ్రతాలూ
ఇప్పుడు ఇసుక మేట వేసిన ఆనకట్టలు

ఒకప్పుడు వీటిద్వారా
చేతన విద్యుథ్చక్తిలా
ప్రవహించేది
జీవనం ఆనందమయం గావించేది
ఇప్పుడూ   ఇవన్నీ ఉన్నాయి , ఫిజికల్ గా  మాత్రమే
చేతనా విద్యుత్తు ప్రవహించడం లేదు 
ఇసుక మేటలు తీసి వేయ్
విద్యుత్  ప్రవాహాన్ని ఏర్పాటు చేయ్ 

Monday, January 26, 2015

ఎవరు

ఎవరు

 చేతుల్నీ కాళ్ళనీ
నేను నా ఇష్టప్రకారం ఆడిస్తున్నాను
కానీ
గుండెని ??
గుండె ఎవరి ఇష్టప్రకారం ఆడుతూందో  

సాగిపో

సాగిపో

కళా సాధకుడా
ప్రేక్షకుల ప్రశంసాభినందనలతో ఆగకు
వారి వహ్వాలు
నీకు పైమేట్టుకు ఆహ్వానాలు

కావు అవి
నీ లక్ష్యసాధనకు చిహ్నాలు

ఇంకా నీవు ముందుకు పోవాలి
వారి వహ్వాలు నీ పూజలుగా మారాలి
ప్రశంసలు నీ ఆరాధనగా మారాలి

నీ ద్వారా
వారి కళాభిలాష
కళా పిపాసగా మారాలి
వారు కళా తపస్వులుగా ఎదగాలి
కళగా పెరగాలి